14 May 2016

ugadi pachadi

ఈ పండుగకు "ఉగాది పచ్చడి" ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. 
ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు,  చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.
ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి.
కానీ కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. 

ఉగాదిపచ్చడి ప్రాముఖ్యత:

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -
  1. బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
  2. ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
  3. వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
  4. చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
  5. పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు
  6. మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

No comments:

Post a Comment

WORLD CLOCK